అమ్మ దయ అందరిపైనా ఉండాలి
- దేవీ చౌక్ వద్ద శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించిన ఎంపీ భరత్
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 26: జగన్మాత ఆ చల్లని తల్లి విజయదుర్గమ్మ కరుణా కటాక్షాలు అందరిపైనా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. సోమవారం ఆయన సతీ సమేతంగా నగరంలోని వివిధ ప్రధాన జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన శ్రీ దేవీ శరన్నవరాత్రి ప్రారంభోత్సవాలకు వెళ్ళారు. తొలుత రాజమండ్రి నగరంలో అత్యంత మహిమాన్వితురాలిగా వినుతికెక్కిన దేవీ చౌక్ వద్ద శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఎంపీ భరత్ ప్రారంభించారు. అమ్మవారికి ఎంపీ భరత్ దంపతులు విశేషార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దంపతులకు పండితులు వేదాశీస్సులు అందజేశారు. ఉత్సవ కమిటీ ఎంపీ భరత్ రామ్ దంపతులను సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. అటు తరువాత కోటిపల్లి బస్టాండు పెట్రోల్ బంక్ పక్కన శ్రీ కనకదుర్గా టాక్సీ ఓనర్స్, డ్రైవర్స్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం, మంగళవారపు పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద, నగరంలోని పనస చెట్టు సెంటర్ దానవాయి బాబు గుడి వద్ద, జేఎన్ రోడ్డు శ్రీ స్వర్ణ దుర్గ నవరాత్రి మహోత్సవాలలో, క్వారీ సెంటర్ వద్ద (47 వ డివిజన్) నవ చండీ పూర్వక పంచమి శరన్నవరాత్రి ఉత్సవాలు, రాజమండ్రి రూరల్ కాతేరు శాంతినగర్ వద్ద, నగరంలోని గోదావరి గట్టు శ్రీ మార్కండేయ స్వామి వారి ఆలయం వద్ద పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించే దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభోత్సవానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో దినదినాభివృద్ధి చెందేలా అందుకు అవసరమైన శక్తిని, ఆరోగ్యాన్ని ముఖ్యమంత్రి జగనన్నకు ప్రసాదించమని కోరినట్టు చెప్పారు. అలాగే దేశం, ప్రపంచం సుభిక్షంగా ఉండాలని, అందుకు ఆ తల్లి కరుణా కటాక్షాలు సర్వ జీవులపైనా పరిపూర్ణంగా ఉండాలని అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మను నిండు మనసుతో కొలిచినట్టు ఎంపీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో రుడా ఛైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.