సచివాలయాల వద్ద జరిగే నిరసన జయప్రదం చెయ్యండి
పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల తగ్గించాలని ఏప్రిల్ 25వ తేదీ వామపక్షాల ఆధ్వర్యంలో సచివాలయాల వద్ద జరగనున్న నిరసనను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని అన్నారు. ఫలితంగా నిత్యావసర సరుకులు ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కరోనాతో అతలాకుతలమైన కుటుంబాలపై ఈ ధరల పెరుగుదల గోరుచుట్టుపై రోకలి పోటుల మారిందని అన్నారు. పెరుగుతున్న ధరల తగ్గింపుకై జరుగుతున్న పోరాటంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని, పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యనారాయణ, చేవూరి కొండయ్య, పసుపులేటి మహేష్, సీపీఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు కరవది భాస్కర్, సీపీఐ ఎంఎల్ నాయకులు లక్ష్మీరెడ్డి, స్త్రీ విముక్తి సంఘటన నాయకురాలు శ్యామల, తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు వేగ వంతంగా టైంస్లాట్ టోకెన్లు జారీ
సర్వదర్శనం టోకెన్ కౌంటర్లను పరిశీలించిన టీటీడీ ఈవో
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా టైంస్లాట్ టోకెన్లు జారీ చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందిచాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను శనివారం ఈవో, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు.
సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల విధానం పునరుద్ధరించాలని టీటీడీ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కౌంటర్ల వద్ద భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగ్గా చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి ఇంజినిరింగ్ అధికారులు ఈవో, అదనపు ఈవోలకు వివరించారు. అన్నప్రసాదాలు అందించేందుకు, అవసరమైన చోట్ల షెల్టర్‌ల ఏర్పాటు, భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో మార్పులు తదితర అంశాలపై చర్చించారు.
ముందుగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దగల కౌంటర్లను పరిశీలించారు. ఆ తరువాత శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, గోవిందరాజస్వామి సత్రాల వద్దగల కౌంటర్లను ఈవో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈవో వెంట జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్ఇ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, విజిఓ శ్రీ మనోహర్, డిఎస్‌పి శ్రీ మురళీకృష్ణ ఇతర ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.
ఏపీ పరిణామాలపై ప్రధాని మోదీకి నివేదిక ఇచ్చిన గవర్నర్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో పరిణామాలపై గవర్నర్ ఒక నివేదిక ఇచ్చారు.రాష్ట్రంలో పరిణామాలపై చర్చించారు. సుమారు 40 నిముషాలపాటు ఈ భేటీ జరిగింది. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. కానీ ఏపీలో ఉన్నటువంటి తాజా పరిస్థితులపై చర్చలు జరిపి, నివేదిక ఇచ్చారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది.. దానికి కారణాలు.. అక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. వాటి కోసం ఏ విధంగా అప్పులు చేస్తున్నది, అభివృద్ధి ఏ మేరకు ఉందన్నదానిపై చర్చలు జరిపినట్లు సమాచారం.
అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాను కలుస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా నరేంద్ర మోదీ, అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఒక నివేదిక అందజేశారు. మరో రెండు నెలల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై గవర్నర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో పరిస్థితులపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.
చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ అంటే తూతూమంత్రంగా నడిపారంటూ ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ ఛైర్మన్‌పై టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగడాన్ని కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయమై చంద్రబాబు, బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం సమన్లు జారీచేసింది. ఈ నెల 27 ఉ.11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమా స్వయంగా రావాలని వాసిరెడ్డి పద్మ ఆ సమన్లలో ఆదేశించారు.
ఈ ఘటనపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. బోండా ఉమ మహిళా కమిషన్‌పై ఆరోపణలు చేస్తున్నాడు. మహిళా కమిషన్ సుప్రీమా? అని బోండా ఉమా అడుగుతున్నాడు అవును, కమిషన్ నీలాంటి వారికి సుప్రీమే. మహిళలని వేధించే వారికి కమిషన్ సుప్రీమే. ఇలాంటి నేరాలు ఎవరూ చేసిన క్షమించేది లేదు. బాధితురాలితో ఎలా వ్యవహరించాలో చంద్రబాబుకు తెలియదని నిన్ననే అర్దమైంది. యుద్దానికి వెళ్తున్నట్టు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలాగ చేస్తున్నారా?. మనసు, శరీరం గాయం అయిన యువతితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. అత్యాచార బాధితురాలితో ఎలా మాట్లాడాలో తెలియదా?. అలాంటి వారికి సమన్లు ఇచ్చే అధికారం మహిళా కమిషన్‌కు ఉంది. గతంలో చాలా కేసుల్లో పోలీసు అధికారులకు కూడా ఇచ్చాం. వారానికి యాభై, అరవై సమన్లు ఇస్తున్నాం.
కోట్లాది మంది మహిళలకు నేను బాధ్యురాలిని. నా హక్కులు నాకు ఉన్నాయి. నేను రాజకీయ నాయకురాలినైతే అప్పుడు వేరేగా ఉండేది. 27న చంద్రబాబు, బోండా ఉమా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందే. లొసుగులతో బయట పడేలా ప్లాన్ చేస్తున్నారు. న్యాయవాదులతో మాట్లాడుతున్నారట. అసలు బాధితురాలి దగ్గర బల ప్రదర్శన చేయటం ఏంటి? నామీద సవాల్ చేయటం ఏంటి? ఆ ఘటనని రాజకీయం చేయడం తప్ప వారిలో సానుభూతి ఏదీ?. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కూడా అత్యాచార బాధితురాలిని పరామర్శించలేదు చంద్రబాబు.
అలాంటి వ్యక్తి నిన్న ఆస్పత్రిలో రచ్చరచ్చ చేశారు. సమన్లు ఎందుకు ఇచ్చామో చాలా స్పష్టంగా చెప్పాము. కచ్చితంగా వారిద్దరినీ కమిషన్ ఎదుట హాజరయ్యేలా చేస్తాం. వారిష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కమిషన్ తల వంచుకోవాలా?. కమిషన్ సమన్లు ఇచ్చిందంటే చచ్చినట్టు హాజరవ్వాల్సిందే. చేసిన తప్పును తెలుసుకుని క్షమించమని అడగాల్సిందిపోయి ఎదురుదాడి చేస్తున్నారు. మీరా మహిళలకు న్యాయం చేసేది?. బాధితురాలి కుటుంబాన్ని సీఎం కలిసేలా కమిషన్ చూస్తుంది. అసలు ఏ అత్యాచార ఘటన దగ్గరకు చంద్రబాబు వెళ్లారు?. రిషితేశ్వరి కేసులో ఆర్నెళ్లు ఏం చేశారని లోకేష్ తన తండ్రిని అడగాలి. వనజాక్షి కేసులో ఏం చేయలేకపోయారెందుకని కూడా తన తండ్రిని అడగాలి అంటూ కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో చంద్రబాబుపై మండిపడ్డారు.
మల్లాoలో మంచి నీటి చలివేంద్రం ఏర్పాటుచేసిన
చిల్లకూరు కోదండరామిరెడ్డి
చిట్టమూరు(స్వర్ణ సాగరం)మండల పరిధిలోని మల్లాoలో వైయస్సార్ విగ్రహం వద్ద వేసవి దృశ్యం వైస్సార్ మంచి నీటి చలివేంద్రంను ఏర్పాటు చేసిన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోదండరామిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లాo గ్రామానికి ప్రతి నిత్యం చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు వస్తుంటారని అసలే మల్లాo గ్రామంలో ప్రజలు ఎప్పుడూ త్రాగునీటి సమస్య ఎదుర్కొంటుందని బయట నుంచి వచ్చే ప్రజలకు నీటి సమస్య లేకుండా చేసేందుకు తన సహాయంగా అనుచరులతో కలిసి మంచి నీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.
సున్నా వడ్డీతో మహిళలే మహారాణులు, తిరుపతి ఎంపీ.
మూడో విడత వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కార్యక్రమంలో భాగంగా తిరుపతి పార్లమెంట్ పరిధి శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన "వైఎస్సార్ సున్నావడ్డీ" పథకం ఉద్దేశించి జరిగిన కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసన సభ్యులు శ్రీ బియ్యపు మధుసూధన రెడ్డి గారితో కలిసి పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ మద్దిల గురుమూర్తి.
ఈ సందర్బభంగా ఎంపీ గారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన అన్ని పథకాలు ప్రజలకు ఉపయుక్తంగా ఉన్నాయని ముఖ్యంగా మహిళలని లబ్ధారులుగా చేస్తూ ముఖ్యమంత్రిగారు చాలా గొప్ప నిర్ణయం తీసుకొన్నారని చెప్పారు.
అలాగే ఎంపీ గారు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్న ముఖ్యమంత్రి గారి లక్ష్యానికి అనుగుణంగా మేము శ్రమిస్తామని మీకు అండగా ఉన్నఈ ప్రభుత్వానికి మీ సహాయ సహకారాలు అందించాలని ఎంపీ గురుమూర్తి గారు పిలుపునిచ్చారు. తదుపరి ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ మూడో విడత వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కార్యక్రమంలో భాగంగా మహిళా లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసారు.