జిల్లాలో ఏర్పాటుచేసిన జగనన్న లేఅవుట్లలో ఇంకా మొదలు కాని ఇళ్ల నిర్మాణాలను మార్చిలోగా మొదలుపెట్టి
నెల్లూరు, జనవరి 11 : నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా జిల్లాలో ఏర్పాటుచేసిన జగనన్న లేఅవుట్లలో ఇంకా మొదలు కాని ఇళ్ల నిర్మాణాలను మార్చిలోగా మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన 73740 ఇళ్లకు గాను 48 వేల ఇళ్ల నిర్మాణాలను మొదలుపెట్టారని, ఇంకా 18 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు మొదలు కాలేదన్నారు. లబ్ధిదారులకు డి ఆర్ డి ఎ, మెప్మా ద్వారా అదనంగా మరో 35 వేల రూపాయల రుణాలను ఇప్పించి ఇళ్ల నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేయాలన్నారు. పట్టా ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికని, స్థలానికి కాదని ఈ విషయాన్ని లబ్ధిదారులకు వివరించి వారు ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎవరైనా లబ్ధిదారులు జియో ట్యాగింగ్ చేసుకోకుండా, ఇంటి నిర్మాణానికి ముందుకు రాకుండా ఉంటారో అలాంటి వారి పట్టాలను రద్దు చేసి ఆ స్థానంలో నిజంగా ఇల్లు లేని లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. గతంలో సంవత్సరానికి జిల్లాకు 1000 ఇళ్లు కూడా మంజూరు అయ్యేవి కావని, ప్రస్తుతం 25వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, ప్రభుత్వం కల్పించిన ఈ గొప్ప అవకాశాన్ని ఇల్లు లేని పేదలు వినియోగించుకొని సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలన్నారు. ప్రతిఒక్క లబ్ధిదారుడికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించే విధంగా ఆప్షన్ 3 ఎంచుకున్న లబ్ధిదారుల గృహాలను త్వరితగతిన పూర్తి చేసి అప్పగించాలన్నారు. సొంతంగా నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు ప్రభుత్వం సకాలంలో మంజూరు చేస్తుందన్నారు. సిఎఫ్ఎంఎస్ పోర్టల్ లో లబ్ధిదారుడి ఖాతాకు బిల్లు మొత్తం జమ అయినట్లు చూపిస్తుందని, వాస్తవంగా పరిశీలిస్తే చాలా మంది లబ్ధిదారులకు బిల్లు జమ కాలేదని తన క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించానని, కావలిలో 186 మందికి ఈ సమస్య ఎదురైందని, రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించి ఈ సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. కోర్టు కేసులు, వర్షాలు, వరదలు, బిల్లులు ఆలస్యం వంటి సమస్యలు ఇప్పుడు లేవని, ప్రభుత్వం కల్పిస్తున్న సహాయ సహకారాలతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు ఇళ్ల నిర్మాణాలకు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే జిల్లాలో ఓటిఎస్ కింద నగదు చెల్లించిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అంతకుముందు జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేంధిర ప్రసాద్, శ్రీ విదేహ్ ఖరె జిల్లాలోని ఇళ్ల నిర్మాణాల దశలవారీ పురోగతి, ఓటిఎస్ పథకం వివరాలను ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి వివరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) శ్రీ గణేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీమతి రోజు మాండ్, డి పి ఓ శ్రీ ధనలక్ష్మి, హౌసింగ్, డి ఆర్ డి ఎ, మెప్మా, డ్వామా పీడీ లు శ్రీ వేణుగోపాల్, శ్రీ సాంబశివా రెడ్డి, శ్రీ రవీంద్ర, తిరుపతయ్య, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి, నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట ఆర్ డి వో లు శ్రీ హుస్సేన్ సాహెబ్, శ్రీ సీనా నాయక్, శ్రీ మురళీకృష్ణ, శ్రీమతి సరోజిని తదితర అధికారులు పాల్గొన్నారు.