కాకాణి చేతుల మీదుగా వంట గ్యాస్ కనెక్షన్ల పంపిణీ
కాకాణి చేతుల మీదుగా వంట గ్యాస్ కనెక్షన్ల పంపిణీ
తేది:11-10-2021 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల కేంద్రంలో మహిళలకు ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
ముత్తుకూరు మండలంలో రెవిన్యూ సమస్యలపై సమీక్షించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే కాకాణి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అన్ని విధాలా అండగా నిలుస్తూ, ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్ల పంపిణీని ప్రోత్సహిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 460 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేయడం సంతోషం. కట్టెల పొయ్యిలో వంట చేయడం వల్ల విపరీతమైన కాలుష్యం వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున, మహిళలు అందరికీ ఉచితంగా వంటగ్యాస్ అందజేస్తున్నాం. కాలుష్య నివారణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికీ ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్ ఏర్పాటు చేస్తాం. మహిళల అభివృద్ధి, సంక్షేమానికి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన విధంగా "వైయస్సార్ ఆసరా" పథకం పేరిట మహిళల రుణాలు రెండోవిడత వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవడమే ధ్యేయంగా, చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడు. చంద్రబాబు, సంబంధం లేని వ్యక్తుల పేర్ల మీద కోర్టుల్లో కేసులు వేయించి, సంక్షేమ కార్యక్రమాలకు అవరోధాలు కల్పిస్తున్నాడు. చంద్రబాబు దొంగ సంతకాలతో కోర్టులో కేసులు వేయించినందుకు, విచారణ జరిపి చట్టపరంగా చంద్రబాబును కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వ పథకాలు అడ్డుకోవాలన్న చంద్రబాబు ఆంతర్యం, ఫోర్జరీ కుట్రతో ప్రజలకు బట్టబయలైంది. పేద ప్రజల ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకున్న చంద్రబాబు, ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి రాగలడు. చంద్రబాబు తెలుగుదేశం నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాలు అడ్డుకోవడం వాళ్ల తాతల తరం కూడా కాదు. సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయడంతో పాటు, ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నాం. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో, గ్రామాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న రెవిన్యూ సమస్యలపై జరుపుతున్న సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అధికారులు చిత్తశుద్ధితో పని చేసి, ప్రజలు ఎక్కడ సమస్యలతో సతమతమవ్వకుండా తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం.