న్యాయవాది
జానకిరామయ్య
ఇక లేరు ❗
-----------------------------------------------
కావలిలో న్యాయవాద వృత్తిలో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయించుకున్న ప్రముఖ న్యాయవాది వై జానకిరామయ్య 19 - 5 - 2020 వ తేదీ మృతి చెందారు . సివిల్ కేసులు వాదించడంలోనూ , ఆ కేసులు నెగ్గించడంలోనూ ఆయనకు ఆయనే సాటి . ఆయన వాదనలు చేసేటప్పుడు న్యాయమూర్తులు ఎంతో ఆసక్తితో వినేవారు . ముఖ్యంగా ఆయన న్యాయశాస్త్రంలోని కొన్ని సెక్షన్స్ కోడ్ చేస్తూ వినిపించే వాదనల్ని - తమ గురువు నేర్పే పాఠాలుగా జూనియర్ న్యాయవాదులు భావించే వారు . కావలిలో నేడు ప్రముఖంగా వున్న న్యాయవాదులు ఆయన దగ్గర శిష్యులు గా వున్న వారే . ఆయన వద్ద శిష్యులు గా ఉండి జడ్జిలుగా ఎంపికై ఉన్నతస్థానాల్లో పదవీ విరమణ చేసిన వారు కొందరున్నారు . ఆయనవద్ద మేము అసిస్టెంట్లు గా పనిచేస్తున్నామని చెప్పుకోడానికి కొందరు జూనియర్ లు గర్వపడేవారు .
ఆయనకు మరోలోకం తెలియదు . న్యాయవాదిగానే వృత్తి , ప్రవృత్తి అంతా . ఎప్పుడూ సుప్రీమ్ కోర్టు , హై కోర్టు జడ్జిమెంట్స్ ముందుపెట్టుకొని చదువుకొంటూ వుండేవారు . అంత గొప్ప చదువరి ఆయన .
1933 లో జన్మించిన జానకిరామయ్య 1954 లోనే న్యాయవాద వృత్తి చేపట్టారు . న్యాయవాదిగా పట్టా చేతబట్టుకొన్న జానకిరామయ్య తొలుత నెల్లూరులోని ప్రముఖ న్యాయవాది రామస్వామి దగ్గర
శిష్యులుగా చేరారు . 1955 లో కావలిలో సబ్ కోర్టు ఆవిర్భవించడంతో - గురువు రామస్వామి సలహామేరకు కావలి వచ్చి న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు . 1954 నుండి 2019 వరకు దాదాపు 65 సంవత్సరాలు కావలిలో ఎదురు తిరుగు లేని న్యాయవాదిగా ఖ్యాతి గడించారు . కావలికి లభించిన ఆణిముత్యాల్లో జానకిరామయ్య కూడా ఒకరు . కుటుంబసభ్యుల వత్తిడితో ఏడాది క్రితం ఆయన బాధాతప్త హృదయంతో తన వృత్తికి విరామం పలికి విశ్రాంత జీవితంలోకి వెళ్లిపోయారు .
గత జనవరిలో జానకిరామయ్య భార్య రాజ్యలక్ష్మి మరణించింది . తనకు తోడూ నీడగా వెన్నంటి నడిచిన సతీమణి అకాల మరణాన్ని ఆయన జీవించుకోలేక పోయారు . భార్య లేదన్న వ్యధ ఆయన్ను బాగా క్రుంగదీసింది . ఆ దిగులుతోనే కాబోలు - భార్య చనిపోయిన 4 మాసాలకే జానకిరామయ్య తనువు చాలించారు . న్యాయవాదుల్లో ఒక లెజెండ్ గా కనిపించిన జానకిరామయ్య ఇక కనపడడు అన్న వార్త కావలి న్యాయవాదుల్లో , ప్రజల్లో శోకాన్ని నింపింది .
జానకిరామయ్య మృతి
కావలికి తీరని లోటు ❗
--------------------------------------
ప్రముఖ న్యాయవాది జానకిరామయ్య మృతిచెందాడన్న వార్త నన్నెంతో క్రుంగదీసిందని
సీనియర్ న్యాయవాది చింతాల వెంకట్రావు తన ఆవేదన వ్యక్తం చేశారు . న్యాయవాద వృత్తికి వన్నెతెచ్చిన మహనీయుడు జానకిరామయ్య అని చింతాల కొనియాడారు . కావలి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు . ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ , ఆయన కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు .
న్యాయవాదులు కలీమ్ , బెల్లంకొండ వేణు మాధవ్ లు వేర్వేరుగా తమ ప్రకటనల్లో జానకిరామయ్య కు సంతాపాన్ని వెలిబుచ్చారు .