అనుమతుల మేరకే భవన నిర్మాణాలు చేపట్టండి





కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,

నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్):

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అనుమతుల మేరకే భవన నిర్మాణాలు చేపట్టాలని, అతిక్రమించిన వాటిని తప్పనిసరిగా తొలగిస్తామని కమిషనర్ సూర్య తేజ ప్రజలకు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం సూచించిన నిర్మాణ నిబంధనల మేరకు, అనుమతించిన వరకు మాత్రమే ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టాలని సూచించారు. భవన నిర్మాణ అనుమతులను కేవలం 24 గంటల్లోనే మంజూరు చేస్తున్నామని, నిర్మాణం అవసరమైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి అని కమిషనర్ సూచించారు. నిబంధనలను, నిర్దేశించిన అనుమతులను ఉల్లంఘించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, ఆయా నిర్మాణాలను కూల్చివేస్తామని కమిషనర్ హెచ్చరించారు. నగరపాలక సంస్థ భవన నిర్మాణ అనుమతులతో పాటు ఫైర్, విద్యుత్, ఇతర ప్రభుత్వ విభాగాల అనుమతులతో పాటు ప్రధానంగా ఆక్యుపెన్సి సర్టిఫికెట్ లేకుండా వ్యాపార వాణిజ్య వ్యవహారాలకై నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను వినియోగించకూడదని కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే నగరపాలక సంస్థ పరిధిలోని పార్కులను శుభ్రంగా నగర ప్రజలకు ఆహ్లాదముగా ఉండునట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని  ఇంజనీరింగ్, అడిషనల్ డైరెక్టర్ హార్టికల్చర్ ప్రదీప్ కుమార్ వారికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని, వాటన్నింటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఫిర్యాదుదారులు తమ సమస్యలను 94940 18118 నెంబరుకు వాట్సప్ ద్వారా లేదా 0861-2356777 & 0861-2316777 హెల్ప్ లైన్ నెంబర్లకు ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల లోపు తెలియజేయాలని కోరారు.

విభాగాల వారీగా అడ్మినిస్ట్రేషన్ - 2,  ఇంజనీరింగ్ - 17, హౌసింగ్ -7, పబ్లిక్ హెల్త్ - 4, టౌన్ ప్లానింగ్ - 14, పెన్షన్ -2, మొత్తం 46 ఫిర్యాదులను అందుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్, సిటీ ప్లానర్ హిమబిందు, డాక్టర్ చైతన్య,, ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరెంటెండెంట్ లు, సిబ్బంది పాల్గొన్నారు.