ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి
ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఆనంద్
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 247 అర్జీలు
నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్)
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జాయింట్ కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ కార్తీక్, డిఆర్‌వో ఉదయభాస్కర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి, జడ్పీ డిప్యూటీ సిఇవో మోహన్‌రావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిశీలించి పరిష్కరించేందుకు ఆయాశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు.
దివ్యాంగుల ట్రైసైకిళ్ల తయారీని ప్రారంభించాలి
దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యాలయం పరిధిలో వున్న ట్రైసైకిళ్ల కర్మాగారాన్ని తిరిగి పునరుద్ధరించాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవాసమితి ఆధ్వర్యంలో వికలాంగులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నెల్లూరులో వున్న ట్రైసైకిళ్ల కర్మాగారం నుంచి ట్రైసైకిళ్లు తయారుచేసి జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోని వికలాంగులకు అందించేవారని, గత కొంతకాలంగా ఇక్కడ తయారీని నిలుపుదల చేసినట్లు చెప్పారు. దివ్యాంగుల కార్పొరేషన్ అధికారులు తమను చులకనభావంతో చూస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా ఇక్కడ సైకిళ్లను తయారు చేయడం లేదని, వెంటనే ట్రైసైకిళ్ల కర్మాగారాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి వికలాంగులకు సహాయం చేయాలని కోరారు.
బదిరులు జిల్లా కలెక్టర్ ను కలసి పుష్ప గుచ్చాం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 247 అర్జీలు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 247 అర్జీలను ప్రజలు అందజేశారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూశాఖకు సంబంధించి 138, మున్సిపల్‌శాఖకు సంబంధించి 21, సర్వేకు 17, పంచాయతీరాజ్‌శాఖకు 14, సివిల్ సప్లయిస్‌కు విభాగానికి సంబంధించి 8 అర్జీలు అందాయి. ఈ అర్జీలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నిర్దిష్ట గడువులోగా అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ, హౌసింగ్ పీడీలు నాగరాజ కుమారి, వేణుగోపాల్, ఎస్‌సి, బిసి ,ST వెల్ఫేర్ అధికారులు శోభారాణి,వెంకట లక్ష్మమ్మ ,పరిమళ , డిటిసి చందర్, డిఇఓ బాలాజీ రావు, పిడి డ్వామా గంగా భవాని,DMHO సుజాత,DCO గుర్రప్ప,ఎలక్ట్రికల్, R&B, పంచాయత్ రాజ్,R&B SE లు,పలువురు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.