ఈఎస్‌ఐ హాస్పిటల్‌ ఏర్పాటులో ముందడుగు

- నెల్లూరులో స్థల పరిశీలన చేసిన  ఈఎస్‌ఐ బృందం

- ఇటీవల ఢిల్లీలో కేంద్రమంత్రి మన్‌సుఖ్‌మాండవీయను కలిసిన ఎంపీ వేమిరెడ్డి

- నెల్లూరులోనే ఈఎస్‌ఐ హాస్పిటల్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

- ఈ మేరకు నెల్లూరుకు వచ్చిన బృందం




నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్)

ఈఎస్‌ఐసి ప్రాజెక్టును నెల్లూరుకు తీసుకువచ్చేందుకు నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి  చేసిన కృషి ఫలితం దిశగా సాగుతోంది. శుక్రవారం విజయవాడ నుంచి ఈఎస్‌ఐసీ రీజినల్‌ డైరెక్టర్‌ ఎ. వేణుగోపాల్‌, డాక్టర్‌ ప్రదీప్‌, దత్తాత్రేయ, రవికుమార్‌, కర్తార్‌ సింగ్‌ లక్కీ, లీలా కుమారిలతో కూడిన ఈఎస్‌ఐ బృందం శుక్రవారం నెల్లూరు నగరానికి వచ్చి ఈఎస్‌ఐ డిస్పెన్సరీ పరిధిలో ఉన్న 2.18 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు.

నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి .. ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌మాండవీయ గారిని, ఈఎస్‌ఐసి డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌కుమార్‌ సింగ్‌ ను కలిసి నెల్లూరు హెడ్‌క్వార్టర్‌లో 100 పడకల ఈ ఎస్ ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడు పలు అంశాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. నెల్లూరుకు కేటాయించిన హాస్పిటల్‌ను విజయవాడలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అథారిటీ వారు.. స్థలాభావం అన్న కారణంతో మరో ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారని నాడు వారికి విన్నవించారు. దానిపై పరిశీలించి నెల్లూరులోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీ పరిధిలో అందుబాటులో ఉన్న 2.18 ఎకరాల్లో 100 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో ఎంపీ వేమిరెడ్డి విజ్ఞప్తి మేరకు అన్ని అంశాలను పరిశీలించేందుకు ఈఎస్‌ఐసి బృందం శుక్రవారం పరిశీలన చేశారు. సదరు నివేదికను రెండు మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. దాంతో జిల్లాలో 100 పడకల ఈ ఎస్ ఐ హాస్పిటల్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. హాస్పిటల్‌ ఏర్పడితే అసంఘటిత కార్మికులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.