విపిఆర్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం

 విపిఆర్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం 










విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గంలోని 140 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ

 ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్ ఆనంద్ గారు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు

దివ్యాంగుల కళ్ళల్లో సంతోషం 

తమను ఎవరూ పట్టించుకోకున్నా విపిఆర్ అక్కును చేర్చుకున్నారని భావోద్వేగం

ప్రజాసేవే ధ్యేయంగా జిల్లాలో ఫౌండేషన్ తరపున అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. ఎన్నికల్లో దివ్యాంగులు పడుతున్న అవస్థలకు పరిష్కారంగా ట్రై సైకిల్స్ పంపిణీ ప్రారంభించినట్లు వివరించారు. బుధవారం ఉదయగిరి నియోజకవర్గం లోని వింజమూరులో విభిన్న ప్రతిభావంతులకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్ళు పంపిణీ చేసే కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారు, ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరితో సమానంగా విభిన్న ప్రతిభావంతులు జీవితంలో ఎదిగేందుకు వారికి మొబిలిటీ అతి ముఖ్యమన్నారు. అప్పుడే వారు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.  ఇందుకు అవసరమైన ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు అందజేయటం సంతోషకరమన్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిళ్ల ద్వారా 20 నుండి 25 కిమీ వరకు వెళ్లగలిగే సౌలభ్యం ఉన్నందున, వారి జీవనోపాధికి ఊతమిస్తాయన్నారు. విపిఆర్ ఫౌండేషన్ సమాజ అవసరాలకనుగుణంగా విస్తృతమైన సేవలు అందిస్తున్నారని, వారికి జిల్లా యంత్రాంగం సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ  సి ఆర్ సి ద్వారా విభిన్న ప్రతిభావంతులకు మండల స్థాయిలో సేవలందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పేదరిక నిర్మూలన, మానవాభివృద్ధిలో విభిన్న కోణాలుంటాయని, వాటినన్నంటిని స్పృశిస్తూ సేవలందిస్తున్న వి పి ఆర్ ఫౌండేషన్ గొప్పదని కొనియాడారు.

పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా సేవే పరమార్ధంగా 10 సంవత్సరాల క్రితం వి పి ఆర్ ఫౌండేషన్ ను స్థాపించడం జరిగిందన్నారు. అప్పటినుండి సమాజంలోని పేద వర్గాలకు వివిధ స్థాయిల్లో విద్య, మంచినీటి వసతి తదితర సేవలందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 150 కి పైగా ఆర్ ఓ ప్లాంట్లను నిర్మించామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం లో పర్యటించినప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది విభిన్న ప్రతిభావంతులను గుర్తించామని, అందుకే మొదటగా ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమంను ఇక్కడి నుంచే ప్రారంభించామన్నారు. మొత్తం 140 మంది లబ్ధిదారులకు ట్రై సైకిళ్లు అందిస్తున్నామన్నారు. ఇదేవిధంగా జిల్లాలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లు త్వరలోనే అందిస్తామన్నారు. కేవలం ట్రై సైకిళ్లు అందజేయడమే కాకుండా వాటికి అవసరమైన మరమ్మత్తులు చేసేందుకు సైతం ప్రత్యేక వ్యవస్థను నియమిస్తున్నామన్నారు.   ఇటువంటి సేవలే జీవితంలో గుర్తుండి పోతాయని, సేవా రాజకీయాలంటేనే తనకు మక్కువన్నారు.

ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అన్ని సేవలు అందిస్తామన్నారు. అడిగిన వెంటనే 35 ఆర్ ఓ ప్లాంట్లను మంజూరు చేసిన విపిఆర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలన్నారు. నియోజకవర్గంలోని 8 మండలాల పేద ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వేల కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ సహాయం చేసే గుణం కొందరికే ఉంటుందని, అటువంటి మంచి మనసు గల వ్యక్తి పార్లమెంట్ సభ్యులుగా ఉండటం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. మంచి నాయకులను ఎన్నుకుంటేనే మంచి పాలన అందిస్తారని, అందుకు అసలైన తార్కాణం యంపియని అన్నారు. 140 మంది లబ్ధిదారులకు 140 ట్రై సైకిళ్ళు తో పాటు అప్పటికప్పుడు ఎవరైనా వస్తే వెంటనే అందజేయుటకు అదనంగా మరో 10 శాతం తెప్పించిన గొప్ప మనసు వేమిరెడ్డి వారిదన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ చంచల బాబు యాదవ్, స్థానిక నాయకులు రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget